వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య.
భూపాలపల్లి: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 2.
భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఒక భార్య తన ప్రియుడితో కలిసి పురుగుల మందు కలిపిన మద్యం భర్తకు తాగించి ఆత్మహత్యగా చిత్రీకరిచింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో హత్య ఉదంతం బయటపడింది.
గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన సుమలత అనే మహిళను గొల్లపల్లికి చెందిన పెండల సంపత్(32) పదేళ్ల క్రితం వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలతో అత్తగారింట్లోనే ఉంటూ ప్లంబర్ పనులు చేస్తున్నాడు. బుద్దారం గ్రామంలో ఉండే ఉమ్మల శ్రీకాంత్ అనే వ్యక్తితో సుమలత వివాహేతర సంబంధం పెట్టుకుని, అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. తమకు సహకరిస్తే రూ.లక్ష ఇస్తామని చెప్పి తరుణ్ అనే వ్యక్తి సహకారంతో, ఈ నెల 17వ తేదీన సంపత్ను మద్యం తాగేందుకు శ్రీకాంత్, తరుణ్ పిలిచారు.
ఊరిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో పురుగుల మందు కలిపిన మద్యం తాగించి, సంపత్ మరణించాక మృతదేహాన్ని బైక్పై ఇంటికి తీసుకెళ్లారు. మృతదేహం చుట్టూ పురుగుల మందు చల్లి, తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని సుమలత అందరిని నమ్మించింది.
పోలీసులు సైతం ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం పూర్తి చేసారు. అయితే తన కొడుకుది ముమ్మాటికీ హత్యేనని సంపత్ తల్లి ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో శ్రీకాంత్, సుమలత భయపడి పెద్దల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించారు.